భారత్‌ నుంచి పాక్‌ గాయకుల్ని తొలగించిన సల్మాన్‌

in #movies6 years ago

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ సినిమా నుంచి పాకిస్థాన్‌ గాయకులు ఆతిఫ్‌ అస్లాం, రహత్‌ ఫతే ఆలీ ఖాన్‌లను తొలగించారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్థాన్‌ కళాకారులతో కలిసి పనిచేయకూడదని భారత చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. పాక్‌ కళాకారుల్ని నిషేధిస్తున్నట్లు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన విడుదల చేసింది. దీన్ని ఉల్లంఘించిన సంస్థను నిషేధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. భవిష్యత్తులో పాకిస్థానీయులు భారత చిత్రాల కోసం పనిచేయకూడదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో సల్మాన్‌ ‘భారత్‌’ సినిమాలో పాటలు పాడిన ఆతిఫ్‌ అస్లాం, రహత్‌ ఫతే ఆలీ ఖాన్‌ల‌ను తొలగించారు. వారి స్థానంలో భారత గాయకుల్ని తీసుకుని, పాటల్ని రికార్డు చేయనున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కత్రినా కైఫ్‌ కథానాయిక. దిశా పటానీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జఫార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్‌కు ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.